రైతులకు గుడ్ న్యూస్.. విద్యుత్ శాఖలో గత రెండేళ్లలో పట్టుబడిన ఏసీబీ కేసుల్లో సగం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మంజూరుకు డబ్బులు డిమాండ్ చేసి దొరికిపోయినవే ఉన్నాయి. దీంతో ఈ కనెక్షన్ల మంజూరు విధానంలో మార్పులకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) శ్రీకారం చుట్టింది. ఇకపైన ఎవరైనా సచివాలయం, మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, 1912 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే.. రిజిస్ట్రేషన్ చేసే పద్ధతిని తీసుకొచ్చింది. తరువాత ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రాధాన్య క్రమంలో ఆయా రైతులకు కనెక్షన్లు ఇస్తారు. ఈపీడీసీఎల్ పరిధిలో తొలిసారి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఎలా నమోదు చేసుకోవాలంటే..!
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం కాల్ చేసిన రైతు తన భూమి ఖాతా సంఖ్య, సర్వే నంబర్ చెప్పిన వెంటనే వెబ్ల్యాండ్లో ఆయా వివరాలను సరిచూసి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. దీనికోసం 1912 కాల్ సెంటర్లో కొంతమంది స్టాఫ్ స్పెషల్ గా పని చేస్తున్నారు. గత నెల రోజుల్లో 5 ఉమ్మడి జిల్లాలకు చెందిన 1,304 మంది రైతులు కొత్త విధానంలోనే వ్యవసాయ కనెక్షన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీసేవ కేంద్రాలు, సచివాలయల్లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని పూర్తిగా నిలిపేశారు. ‘విద్యుత్ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయాలి. వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కొత్త పద్ధతిని అమలు చేస్తున్నాం’ అని ఈపీడీసీఎల్ సీఎం డీ పృథ్వీ తేజ్ చెప్పారు. రైతులు కాల్ చేసిన సమయంలో బిజీ వచ్చినా, తిరిగి వారికి ఫోన్ చేసి వివరాలు తీసుకుంటారని.. కనెక్షన్ల కోసం మధ్య వర్తులను ఆశ్రయించొద్దని ఆయన సూచించారు.