ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటనపై సీఎం చం ద్రబాబుకు అధికారులు నివేదిక సమర్పించారు. ఈ సంఘటనలో కుట్ర కోణం ఉందని నివేదికలో వెల్లడించారు. ఢీకొన్న బోట్లు వైకాపా నేతలు.. కార్యకర్తలవని నిర్ధరించారు. వైకాపా MLC తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లు నివేదికలో వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్.. ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునే వారని చెప్పారు. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించామన్నారు.
ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను కర్రి నరసింహా స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీ, ఉషాద్రిలకు చెందినవిగా గుర్తించారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందని చెప్పారు. సహజంగా మూడింటిని కలిపి కట్టరని నివేదికలో వ్యాఖ్యానించారు. వాటికి ఇనుప చైన్ల లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లు పేర్కొన్నారు. తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండింటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని తెలిపారు. సెప్టెంబర్ 2న తెల్లవారు జామున 3 గంటల సమయంలో 5 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టినట్టు నివేదికలో స్పష్టం చేశారు. అవి గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్లకు కాకుండా బ్యారేజీ పిల్లర్లను బలంగా ఢీకొడితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని తెలిపారు. మరోవైపు పోలీసులు నిందితుల కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు.