హనుమకొండలోని J.N.S. స్టేడియంలో నిర్వహించిన ‘డబుల్ ఇస్మా ర్ట్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. రామ్ హీరోగా ఆయన తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమా గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్గా వస్తుంది. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు పూరి మాట్లాడుతూ.. ‘‘హిట్ సినిమా తీస్తే చాలామంది ఫోన్ చేసి ప్రశంసిస్తారు. ఫ్లాప్ సినిమా విషయంలోనూ నాకు ఓ కాల్ వచ్చింది. చేసిందెవరో కాదు విజయేంద్ర ప్రసాద్. ‘నాకో సాయం చేస్తారా?’ అని అడిగారు. ‘ఆయన కుమారుడు రాజమౌళే పెద్ద డైరెక్టర్. నేనేం హెల్ప్ చేయాలి?’ అని మనసులో అనుకున్నా. ‘తదుతరి చిత్రం ఎప్పుడు చేస్తున్నారు? మీరెప్పుడు చేసినా ఆ సినిమా కథ నాకు చెబుతారా?’ అని అడిగారు. ఆయనెందుకు అలా అంటున్నారో కొంచెం అర్థమైంది. ‘మీలాంటి డైరెక్టర్లు ఫెయిల్ అవ్వడం నేను చూడలేను. చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అందుకే తీసే ముందు నాకు ఒక్కసారి చెప్పండి’ అని అన్నారు. ఆయన మాటలతో భావోద్వేగానికి గురయ్యా. నాపై అభిమానంతో చేసిన ఆ కాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. అయితే, ఈ స్టోరీ గురించి ఆయనకు చెప్పలేదు. జాగ్రత్తగా తెరకెక్కించి, సినిమానే చూపించాలనుకున్నా’’ అని చెప్పారు.
‘‘ఇస్మార్ట్ శంకర్’ ప్రీ రిలీజ్ ఇక్కడే చేశాం. మరోసారి ఇక్కడికి వచ్చి మీ ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ సినిమా విషయంలో అందరికంటే ఎక్కువగా మణిశర్మ కష్టపడ్డారు. సంజయ్ దత్తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. కావ్యా థాపర్ హార్డ్ వర్క్ చేస్తుంది. ఛార్మి లేనిదే ‘డబుల్ ఇస్మార్ట్’ లేదనుకుంటున్నా. ఆమె ఓ ఫైటర్. టాలీవుడ్కు స్ఫూర్తినిచ్చే దర్శకుడు పూరి జగన్నాథ్. దర్శకుడు, రచయిత కావాలనున్న చాలామంది ఆయన్ను చూసే ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటారు. ఆయనతో కలిసి పని చేస్తే వచ్చే కిక్ ఎక్కడా రాదు. మనలో చాలామంది తమ అభిప్రాయానికి గౌరవం ఇవ్వ డం లేదు. మనం ఓ రెస్టారెంట్లో తిన్న బిర్యానీ బాగుంటే.. మిగిలిన వారు బాగోలేదంటే మనపై మనకు డౌట్ ఉండకూడదు. నేను తిన్నాను బాగుందనుకోవాలి. సినిమాల విషయంలోనూ మీ కెరీర్ విషయంలోనూ అంతే. పక్క వారి ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చు కోవద్దు. ఎందుకంటే ఇతరుల అభిప్రాయాలతో పోల్చుకుంటే మనం ఏ పనీ చేయలేం. మీరంతా నా వాళ్లు అనుకుని ఇదంతా చెబుతున్నా’’ అని అన్నారు. కార్యక్రమంలో కావ్యా థాపర్, ఛార్మి, అలీ తదితరులు పాల్గొన్నారు.