మందుబాబులకు షాక్ తగిలింది. ఎలాగంటారా.. హైదరాబాద్లో యువత వీకెండ్ రాగానే పబ్లు, పార్టీలంటూ రచ్చ రచ్చ చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇక ఫుల్గా తాగి కొందరు మైకంలోనే వాహనాలు నడుపుతుంటారు. ఇలాంటి మందుబాబులపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝుళిపించారు. వీకెండ్ల్లో మద్యం తాగి రోడ్లపైకి వచ్చే వారిపైన కఠిన చర్యలు ముమ్మరం చేశారు.
నగరంలో శుక్ర, శని వారాల్లో రాత్రి విస్తృతంగా సోదాలు చేసి తాగిన మైకంలో వాహనాలు నడిపిన 212 మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ జాయింట్ CP జోయల్ డేవిస్ తెలిపారు. వారిని కోర్టు ముందు హాజరు పరచనున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వారిలో ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. 165 మంది బైకర్లు, 34 మంది కార్లు తదితర నాలుగు చక్ర వాహనాలు, ముగ్గురు భారీ వాహన డ్రైవర్ల తోపాటు పదిమంది మద్య మత్తులో ఆటోలు నడుపుతూ పట్టుబడినట్లు చెప్పారు. ఇంకో 21 మంది స్పృహ కూడా లేనంతగా మత్తులో ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు వివరించారు.