‘‘మాస్ రాజా రవితేజ లేకుండా నా సినీ జీవితాన్ని ఊహించుకోలేను. మేం కలిసి చేసిన ‘మిస్టర్ బచ్చన్’ మళ్లీ మళ్లీ చూసే సినిమా’’ని హరీష్ శంకర్ చెప్పారు. ఆయన దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ, భాగ్య శ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా ఇది. T.G.విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం రాత్రి కర్నూలులో విడుదలకు ముందస్తు వేడుకని నిర్వహించారు. మాజీ ఎంపీ T.G.వెంకటేశ్, ఎమ్మెల్యేలు గౌరు చరిత, బి.కె.పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ‘‘అందరూ కష్టపడతారు. కానీ హరీష్ శంకర్ ప్రతి విభాగాన్నీ పక్కాగా పర్యవేక్షిస్తూ శ్రమిస్తుంటాడు. నిర్మాత T.G. విశ్వ ప్రసాద్ ఇలా సినిమాలు తీస్తూనే ఉండాలి. విజయాలు సాధిస్తూనే ఉండాలి. మిక్కీ జె.మేయర్ నుంచి ఇలాంటి సంగీతం వస్తుందని ఊహించలేదు. తను షాక్ ఇచ్చాడు. ఈ సినిమా ఆగస్టు 14 సాయంత్రం నుంచే సందడి చేయబోతుంది. అందరూ చూసి ఆస్వాదించాల’’ని కోరారు.
దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘‘తల్లి ఒకేసారి జన్మనిస్తారు. కానీ, నాకు దర్శకుడిగా జన్మనీ, పునర్జన్మనీ ఇచ్చిన కథానాయకుడు రవితేజ. నా జీవితంలో నేను ఈ స్థాయికి వచ్చి, ఈ వేదికపై నిలబడటానికి కారణం ఆయనే. చాలా ఏళ్ల తర్వాత ఆయనతో సినిమా కోసం సెట్కి వెళ్లినప్పుడు ఎక్కడా లేని ప్రశాంతత వచ్చింది. సినిమాపై వంద రెట్ల తపనతో పనిచేస్తుంటారు. టి.జి.విశ్వ ప్రసాద్. ఆయన సహకారంతోనే ఇంత వేగంగా ఈ సినిమాను పూర్తి చేశాం. ఆగస్టు 15న ‘డబుల్ ఇస్మార్ట్’ కూడా విడుదలవుతోంది. రెండూ చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుంది అన్నారు. T.G. విశ్వ ప్రసాద్. ఈ కార్యక్రమంలో మిక్కీ జె.మేయర్, ఆయనంక బోస్, భాస్క రభట్ల, కాసర్ల శ్యా మ్, గిరిధర్, ప్రవీణ్, పృథ్వీ, భాను, బి.వి.ఎస్.రవి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కేఆర్కే, సహనిర్మాత వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.