కొత్తగా సినీ ఇండస్ట్రీకి వస్తున్న దర్శకులు, నటీనటులను ప్రోత్సహించాలని, కొత్త కథలను ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో నటి నిహారిక సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు 16 మంది నూతన నటీనటులతో తాజాగా ఆమె నిర్మించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్న మైన కథతో దీనిని రూపొందించారు. తాజాగా ఈ సినిమా గురించి నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ x’ వేదికలో ట్వీట్ చేశారు. నిహారికకు అభినందనలు తెలిపారు. ‘‘కమిటీ కుర్రోళ్ళు ’ గురించి చాలా మంచి విషయాలు వింటున్నా. సినిమా నిర్మా ణంలోకి అడుగుపెట్టినందుకు, తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్ నిహారిక. త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తా’’ అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది సినీప్రియుల దృష్టిని ఆకర్షిస్తుంది. అగ్రనటుడు అయినప్పటికీ చిన్న చిత్రాలను ప్రోత్సహిస్తున్నారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యదువంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ సినీప్రియుల ఆదరణను సొంతం చేసుకుంది. దీంతో స్క్రీన్స్, షోలు పెంచుతున్నామని ఆదివారం సినిమా యూనిట్ తెలియజేసింది. ఈ సినిమా విజయంపై ఇటీవల నిహారిక స్పందించారు. తాను జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇదీ ఒకటని చెప్పారు. ‘‘నా సోదరుడు, నటుడు అంకిత్.. ఓసారి ఫోన్ చేసి.. తన స్నేహితుడి వద్ద మంచి స్టోరీ ఉందని చెప్పాడు. నాకు పెద్దగా ఆసక్తి కలగలేదు. వేర్వేరు కారణాలు చెప్పి మూడు నెలలు వాయిదా వేశా. అతడు అంతలా అడుగుతుంటే కాదనలేక స్టోరీ వినడానికి ఒప్పుకున్నా. నా జీవితంలో నేను తీసుకున్న మంచి నిర్ణయాల్లో అది కూడా ఒకటి. కమిటీ కుర్రోళ్ళు స్టోరీ విన్నా. దాని తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మా సినిమా చూసి కొంతమంది సెకండాఫ్లో ఇది బాలేదు.. అది బాలేదని రివ్యూలు రాస్తున్నారు. వారికి నేను చెప్పేది ఒక్కటే. మేము 100% అందరికి నచ్చేలాగా సినిమా చేయలేం. 99% అందరికి మా సినిమా నచ్చింది. ఇది ఇప్పుడు పీపుల్స్ మూవీ అయ్యింది’’ అని భావోద్వేగానికి గురయ్యారు