ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు చేపల వేట కోసం వెళ్లి వాగులో పడి ప్రాణాలను కోల్పోయిన విషాదఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామీణ సీఐ ఫణిధర్ వివరాల ప్రకారం… మహారాష్ట్ర నాందేడ్లోని నవీ ఆబాదీకి చెందిన నాగుల్వాడ్ రాజు – మీనా బతుకుదెరువు కోసం తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామానికి వారం రోజుల క్రితం వలసవచ్చారు. వీరి ముగ్గురు కుమారులు విజయ్(28), ఆకాష్(26), అక్షయ్(22) హైదరాబాద్లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. విజయ్ లారీ డ్రైవర్గా పని చేస్తుండగా.. మిగిలిన ఇద్దరూ కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
శ్రీకృష్ణాష్టమి పండగ కోసం బండల్ నాగపూర్లోని తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం పొచ్చర వాగులో సరదాగా చేపలు పట్టడానికి బంధువైన కాంబ్లే శ్రీనివాస్తో కలిసి వెళ్లారు. ఇందులో ఆకాశ్కు కొంత ఈత వచ్చినా.. మిగతా ఇద్దరికీ ఈత రాదు. చీరతో చేపలు పట్టే క్రమంలో వారు వాగులో పడి పోయారు. సమాచారం తెలుసుకున్న డీఎస్పీ జీవన్రెడ్డి, గ్రామీణ సీఐ, ఎస్ఐలు ముజాహిద్, అంజమ్మలు ఘటనా స్థలానికి చేరుకొని డీడీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టగా మొదట విజయ్ మృతదేహం లభించింది. తర్వాత అక్షయ్, అకాశ్ల మృతదేహాలు లభించాయి. వీరిలో విజయ్, అక్షయ్లకు రెండేళ్ల క్రితం… ఆకాశ్కు నాలుగు నెలల కిందట వివాహమైంది. విజయ్కు 10 నెలల కుమారుడు ఉన్నారు. ముగ్గురు కుమారులూ తమ కళ్లముందే విగతజీవులుగా పడి ఉండడం చూసి ఆ తల్లితండ్రులు భోరున విలపించారు.